నిబంధనలకు విరుద్ధంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రధాని కార్యాలయంనుంచే  ఆదేశాలు
Photo credit: Business Standard
Governance

నిబంధనలకు విరుద్ధంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రధాని కార్యాలయంనుంచే ఆదేశాలు

కొన్ని రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలను అనుమతించాలని సాక్షాత్తూ ప్రధాని కార్యాలయమే ఆర్థిక శాఖను ఆదేశించింది

Nitin Sethi

Nitin Sethi

వివాదాస్పద ఎలక్టొరల్ బాండ్స్ పథకానికి సంబంధించి నరేంద్రమోది నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2018 జనవరి 2న నిబంధనలను ప్రకటించింది. అయితే కొద్ది కాలానికే ఆ నిబంధనలకు మినహాయింపు ఇస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఈ ఎలక్టొరల్ బాండ్స్ అనే పథకంతో భారత దేశ ఎన్నికలను కార్పొరేట్ సంస్థలుప్రభావితం చేయటానికి అధికారికంగా తలుపులు తెరిచినట్లయింది. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు రహస్యంగా పార్టీలకు విరాళాలు ఇవ్వటానికి, భారత ఎన్నికల వ్యవస్థలోకి హవాలా డబ్బు ప్రవహించటానికి ఈ పథకం మార్గం సుగమం చేసింది.

2017 బడ్జెట్ ప్రసంగంలో నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మొట్టమొదటగా ప్రకటించిన ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకంలో విరాళాలు ఇచ్చే దాతల వివరాలను పూర్తిగారహస్యంగా ఉంటాయి. దాతలు తాము ఇచ్చే నిధులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పనవసరంలేదు, పార్టీలుకూడా తమకు నిధులు ఎక్కడనుంచి వచ్చాయో తెలపాల్సిన అవసరంలేదు. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలపై పరిమితినికూడా తొలగించటం ప్రభుత్వం చేసిన మరో ముఖ్యమైన మార్పు. అంటే దాతలు తాము ఎంచుకున్న పార్టీవారి ఖజానాలోకి ఎంత డబ్బయినా తరలించవచ్చు.

ఈ పథకం ద్వారా సంవత్సరంలో నాలుగు సార్లు, జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో పదిరోజులు చొప్పున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు బాండ్స్ అమ్మకాలుజరపాలని 2018 జనవరిలో ప్రభుత్వం మరో ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరాలలో అదనంగా మరో 30 రోజులపాటు ఈ ఎలక్టొరల్ బాండ్స్ అమ్మటానికి కూడా వీలు కల్పించారు.

ఇక అసలు విషయానికొస్తే, రెండు వేర్వేరు సందర్భాలలో వివిధ రాష్ట్రాలలో జరిగే ఎన్నికలకోసం నిబంధనలకు విరుద్ధంగా ఈ ఎలక్టొరల్ బాండ్స్ ప్రత్యేక అమ్మకాలకుఅనుమతిని ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థికశాఖకు ఎలా ఆదేశాలు జారీ చేసిందో తెలిపే రహస్య పత్రాలను పారదర్శత కార్యకర్త కమాండర్ లోకేష్ బాత్రా(రిటైర్డ్) సంపాదించారు. వాస్తవానికి, సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే - అదికూడా కొద్ది రోజులు మాత్రమే ఈ బాండ్స్‌ను అమ్మాలని రిజర్వ్ బ్యాంక్ మొదట్లో సూచించింది.

మోది మొదటి దఫా ప్రభుత్వం కాలపరిమితి ముగియటానికి కొద్దికాలానికి ముందు కర్ణాటక, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మిజోరామ్, రాజస్థాన్, తెలంగాణలలోఎన్నికలు వచ్చాయి.2019 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌లాంటివిగా భావించటంతో ఈ అసెంబ్లీ ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. సరిగ్గా ఈ ఎన్నికలకుముందు ఎలక్టొరల్ బాండ్స్ ప్రత్యేక అమ్మకాలకు నిబంధనలలో మినహాయింపు ఇవ్వటంవెనక మోది ప్రభుత్వం ఉద్దేశ్యం ఏమిటో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు.

2018 మార్చిలో మొట్టమొదటగా జరిగిన ఈ బాండ్స్ అమ్మకం ద్వారా వచ్చిన విరాళాలలో 95% బీజేపీకే చేరినట్లు ఆ పార్టీ వార్షిక నివేదిక చూపుతోంది.2018-19 ఆర్థిక సంవత్సరంలో పై రాష్ట్రాల ఎన్నికలకోసం జరిగిన బాండ్స్ అమ్మకాలద్వారా బీజేపీ, ఇతర పార్టీలకు ఎంత విరాళాలు వచ్చాయనే సమాచారం అందుబాటులోలేదు.

ప్రధానమంత్రి కార్యాలయం మెమో

ఎలక్టొరల్ బాండ్స్ పథకం నిబంధనలకు ఆదిలోనే నీళ్ళొదిలేశారు. వాస్తవానికి ఈ పథకం ప్రారంభమైన తర్వాత వచ్చిన ఏప్రిల్(2018) నెలలో బాండ్స్ మొదటి దఫాఅమ్మకాలు జరగాల్సిఉంది. కానీ, మార్చి 2018లోనే మొదటి దఫా అమ్మకాలు ప్రారంభించారు. రు.222 కోట్ల విలువైన బాండ్స్ అమ్ముడుపోగా, దీనిలో 95% నిధులు బీజేపీకే పోయాయి.

తదుపరి నెలలో, అంటే 2018 ఏప్రిల్ నెలలో ఎస్‌బీఐ జరిపిన రెండో దఫా అమ్మకాలలో రు.114.90 కోట్ల విలువైన బాండ్స్ కొనుగోళ్ళు జరిగాయి... విరాళాలుగాఇవ్వబడ్డాయి. అయితే మోది ప్రభుత్వం అక్కడితో ఆగలేదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 మే నెలలో జరగబోతుండగా, మరో 10 రోజులపాటు ఎలక్టొరల్ బాండ్స్ ప్రత్యేక అమ్మకాలు జరపాలని ప్రధానమంత్రి కార్యాలయంఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానంత్రి కార్యాలయం ఈ ప్రత్యేక అమ్మకాలు కర్ణాటక ఎన్నికలకోసం అని నేరుగా చెప్పకపోయినా ఆ ఆదేశాల వెనక ఆంతర్యం కర్ణాటక ఎన్నికలకోసమేనంటూ

ఆర్థికమంత్రిత్వశాఖలోని ఒక అధికారి ఒక నోట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

2018 ఏప్రిల్ 3న ఒక అంతర్గత ఫైలులో ఆ ఉన్నతాధికారి - ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని పర్యవేక్షించే డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ - ఇలా రాశారు, "2018 జనవరి 2న జారీ అయిన ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకం నోటిఫికేషన్లోని 8వ పేరా(2)లో ఉదహరించిన ఎన్నికలకు అర్థం సాధారణ ఎన్నికలు(లోక్ సభ) మాత్రమే. అంటే, ఎలక్టొరల్ బాండ్స్ పథకం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఉద్దేశించినది కాదు అని స్పష్టంగా చెబుతోంది."

సమస్య ప్రధానమంత్రి కార్యాలయంలో లేదని, పాలకులలోనే ఉందని వ్యాఖ్యానిస్తూ, ఈ నిబంధనలను మార్చాల్సిఉందని విజయ్ కుమార్ సూచించారు. అయితే సూచన సరైనది కాదంటూ ఎకనామిక్ ఎఫైర్స్ కార్యదర్శి, ఆ శాఖలోని అత్యున్నతస్థాయి అధికారి అయిన గార్గ్ తోసిపుచ్చారు.

"లోక్ సభ ఎన్నికలు అంటేనే ప్రత్యేక సందర్భం అని అర్థం. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రత్యేక సందర్భాలే. కాబట్టి ప్రత్యేకంగా సవరణ అవసరంలేదు" అని గార్గ్ 2018 ఏప్రిల్ 4న లేఖ రాశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రధాని కార్యాలయంనుంచే  ఆదేశాలు

ఒకవారం తర్వాత, ఎలక్టొరల్ బాండ్స్ పథకంలోని నిబంధనలు చెప్పేదానికి, ప్రధానమంత్రి కార్యాలయం కోరేదానికి మధ్య వైరుధ్యాన్ని వివరిస్తూ 2018 ఏప్రిల్ 11న విజయ్ కుమార్ మరొక లేఖ రాశారు. ప్రత్యేకంగా 10 రోజులపాటు ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలను జరపాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించిందని, కానీ 2018 జనవరి 2నాటి పథకం నోటిఫికేషన్లోని 8వ పేరా(2)లో సాధారణ ఎన్నికలముందు మాత్రమే అదనంగా 30 రోజులపాటు బాండ్స్ అమ్మొచ్చని పేర్కొని ఉందని కుమార్ గుర్తుచేశారు. లోక్ సభకు ఎన్నికలు జరగటానికి చాలా సమయం ఉన్నందున, ఈ ఆదేశాలు నోటిఫికేషన్లోని అంశాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.

సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయమే ఆదేశాలు ఇచ్చిందని ఉన్నతాధికారులు లిఖితపూర్వకంగా పేర్కొనటం ఇక్కడ గమనార్హం. భారతదేశ బ్యూరోక్రటిక్ వ్యవస్థలో, ప్రధానమంత్రి నేరుగా ఆదేశాలు ఇచ్చినాకూడా, "ప్రధానమంత్రి కార్యాలయం" ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ రికార్డులలో పేర్కొనటం రివాజు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రధాని కార్యాలయంనుంచే  ఆదేశాలు

ప్రధానమంత్రి కార్యాలయం ప్రస్తావన రావటంతో ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ కార్యదర్శి గార్గ్ వెంటనే అప్రమత్తమైపోయి తన వాదనను పూర్తిగా మార్చేశారు. ఏప్రిల్ 11న ఆయన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖ రాశారు. ఎలక్టొరల్ బాండ్స్ సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే విడుదల చేయాల్సి ఉందని, దానికితోడు సాధారణ ఎన్నికలు ఏమీ జరగబోవటంలేదని గుర్తు చేశారు.

అయితే, నాలుగు నెలల క్రితం, 2018 జనవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మినహాయింపు ఇవ్వొచ్చని గార్గ్ సూచించారు. అవసరాన్నిబట్టి, ప్రత్యేక మినహాయింపుతో 2018 మే 1-10 మధ్య బాండ్స్ అమ్మకాలు జరపొచ్చని గార్గ్ పేర్కొన్నారు. ఆ "అవసరం" ఏమిటి అనేది గార్గ్ స్పష్టంగా చెప్పకపోయినా, జైట్లీ మాత్రం ఆ మినహాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రధాని కార్యాలయంనుంచే  ఆదేశాలు

అలా ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలమేరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలు జరిపేందుకుగానూ నిబంధనలకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక మినహాయింపు ఇస్తూ అనుమతిని మంజూరు చేసింది. అయితే 2018 చివరిలో మళ్ళీ కొన్ని అసెంబ్లీ ఎన్నికలు వచ్చినపుడు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ నిబంధనలకు మినహాయింపును ఇస్తూ తిరిగి బాండ్స్ అమ్మకాలకు అనుమతిని ఇచ్చింది.

బాండ్స్ అమ్మకాలపై లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ ఒక ఈమెయిల్ లో బదులిస్తూ, కొన్ని ప్రశ్నలకు తాము విస్తృతంగా సమాధానాలు ఇవ్వలేమని, వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో తలమునకలుగా ఉన్నామని పేర్కొన్నారు, అన్ని నిర్ణయాలనూ "సదుద్దేశ్యం"తోనే తీసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం అసలు ఈ ప్రశ్నలపై స్పందించనే లేదు.

రాష్ట్ర ఎన్నికలకోసం ధనప్రవాహం

2018 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, మిజోరామ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో అదే డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ 2018 అక్టోబర్ 22న మళ్ళీ ఎలక్టొరల్ బాండ్స్ ప్రత్యేక అమ్మకాలకోసం అనుమతి మంజూరు చేయాలని ప్రతిపాదిస్తూ 2018 నవంబర్ నెలలో తనపై ఉన్నతాధికారులకు ఒక లేఖ రాశారు. అయితే ఈసారి తనకు ఆదేశాలు ఎక్కడనుంచి వచ్చాయో పేర్కొనలేదుగానీ, ఆ ఆదేశాల లక్ష్యం మాత్రం పేర్కొన్నారు.

2018 మే నెలలో జరిపిన ప్రత్యేక ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలను బీజేపీ ప్రభుత్వం ఒక రివాజుగా కొనసాగించటానికే నిశ్చయించుకుందని ఆయన రాసిన నోట్ ద్వారా తెలుస్తోంది.

2018 అక్టోబర్ 22నాటి నోట్ లో ఇలా ఉంది: "ఐదు రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆదేశాల మేరకు పదిరోజులపాటు ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రతిపాదిస్తున్నాము. కేంద్ర ఆర్థికమంత్రి అనుమతితో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2018 మే 1-10 మధ్య జరిపినట్లుగానే మళ్ళీ ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలు జరపాలి"

నిబంధనలకు విరుద్ధంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి ప్రధాని కార్యాలయంనుంచే  ఆదేశాలు

ఏమాత్రం సంశయించకుండా గార్గ్, అరుణ్ జైట్లీ ఈ రెండో విడత ప్రత్యేక అమ్మకాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రు.184 కోట్ల విలువైన ఎలక్టొరల్ బాండ్స్ ను స్టేట్ బ్యాంక్ నుంచి దాతలు కొనుగోలు చేసి పార్టీలకు విరాళంగా ఇచ్చారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు 2018 మే నెలలో ఒక్కసారికి మాత్రమే అనుకున్న మినహాయింపును బీజేపీ ప్రభుత్వం ఆ ఏడాది చివరికి వచ్చేసరికి ఒక రివాజుగా మార్చేసింది. 2019 మే నెలనాటికి, రు.6,000 కోట్లకు పైగా విలువైన ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలు జరిగాయి, పార్టీలకు ఆ నిధులు బట్వాడా అయ్యాయి. వీటిలో మొదటి విడత జరిగిన పద్ధతి పరిశీలిస్తే, అధికార పార్టీకే విరాళాలు అత్యధిక శాతం బదిలీ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

(అనువాదం: శ్రవణ్ బాబు)

(ఈ కథనం మొట్టమొదట హఫింగ్టన్ పోస్ట్ ఇండియా వెబ్ సైట్లో ప్రచురితమయింది - Link)

Read Parts 1 and 2 here.

The Lede
www.thelede.in