ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
Photo credit: Reuters
ది లీడ్ - తెలుగు

ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!

ఎలక్టొరల్ బాండ్స్ ని వ్యతిరేకిస్తున్న ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించటానికి కేంద్రం అబద్ధాలు చెప్పింది

Nitin Sethi

Nitin Sethi

పారదర్శకత అనే పదానికి మోది ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే భారీ విరాళాల విషయంలో పారదర్శకత తీసుకొస్తామని ఓవైపు చెబుతూనే, మరోవైపు - ప్రజలకు తెలియకుండా కార్పొరేట్ సంస్థలనుంచి రాజకీయపార్టీలు భారీ విరాళాలు సేకరించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని రూపొందించింది. దీనిని భారత ఎన్నికల సంఘం తీవ్రంగా వ్యతిరేకించంతో దానిని కప్పిపుచ్చుకోవటంకోసం సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే పచ్చి అబద్ధాలు చెప్పాల్సివచ్చింది. వీటిని 'ద లీడ్' ఎలా బయటపెట్టిందో చూడండి.

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పవిత్ర వేదికగా పరిగణించే పార్లమెంట్ సభామధ్యంలోనే నాటి ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ ఎలక్టొరల్ బాండ్స్ గురించి అబద్ధాలు చెప్పటం బయటపడిపోయింది. అయితే దీనినుంచి మంత్రిని కాపాడటంకోసం ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులు ఇచ్చిన సంజాయిషీలను 'ద లీడ్' సంపాదించింది.

ఎలక్టొరల్ బాండ్స్‌పై ఎన్నికల సంఘానికి ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని పసలేనిదిగా ప్రచారంచేయటంకోసం ఉన్నతాధికారులు తప్పుడు సమాచారంతో, తప్పుడు వాదనలతో రాసిన ఒక లేఖ ఈ రహస్యపత్రాలలో ఉంది. మరోవైపు, ఈ వ్యవహారంలో ఎన్నికలసంఘం అభిప్రాయాన్నేకాదు, ప్రతిపక్షాల అభిప్రాయాలనుకూడా మోది ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. ఒకవైపు కేంద్ర ఆర్థికశాఖ ఈ బాండ్స్ పథకానికి తుదిమెరుగులు దిద్దుతుండగానే ఈ విషయంపై ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను తెలపాలంటూ మొక్కుబడిగా ప్రభుత్వం కోరింది. అయితే వారి అభిప్రాయాలనుగానీ, వారు లేవనెత్తిన ప్రశ్నలనుగానీ అసలు పట్టించుకోనేలేదు.

మోది ప్రభుత్వం రెండు నాల్కల వైఖరిని చాటిచెప్పిన ఈ ఎలక్టొరల్ బాండ్స్‌ మొట్టమొదటగా 2017లో చెలామణిలోకి వచ్చాయి. నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బాండ్స్ ద్వారా ఏ కార్పొరేట్ సంస్థగానీ, ట్రస్ట్ గానీ, ఎన్‌జీఓగానీ, వ్యక్తిగానీ దేశంలోని ఏ రాజకీయపార్టీకైనా ఎంతయినా డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సేకరించిన సమాచారం మేరకు ఈ బాండ్ల ద్వారా మొదటి విడతలో సేకరించిన విరాళాలలో 95% డబ్బు అధికార భారతీయ జనతా పార్టీకే వెళ్ళింది.

ఈ బాండ్ల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీమ్ కోర్ట్ ప్రస్తుతం విచారిస్తోంది. పారదర్శకత కార్యకర్త కమాండర్ లోకేష్ బాత్రా(రిటైర్డ్) సేకరించిన పత్రాలలోని సమాచారం మేరకు, పార్లమెంట్‌ వంటి అత్యున్నత వేదికలో ప్రభుత్వం ప్రకటనలు చేసినప్పటికీ ఈ వ్యవహారంలో సర్కార్ మాటలకు, చేతలకు పొంతన లేదు.

2019 పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ నదిముల్ హక్ ఈ విషయంలో ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న వేశారు: ఎలక్టొరల్ బాండ్స్‌పైన భారత ఎన్నికల సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసిందా, లేదా?

"ఎలక్టొరల్ బాండ్స్ పైన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆక్షేపణలనూ వ్యక్తపరచలేదు" అని నాటి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ పై ప్రశ్నకు జవాబు ఇచ్చారు.

ఇది శుద్ధ అబద్ధం. బాత్రా ప్రభుత్వంలో అంతర్గతంగా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కొన్నింటిని బయటపెట్టారు. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలలోని సమాచారం చూస్తే ప్రభుత్వ సమాధానం అబద్ధమని స్పష్టంగా తెలుస్తోంది. మంత్రి పార్లమెంట్‌లో అబద్ధం చెప్పారంటూ హక్ ఒక హక్కుల ఉల్లంఘన ఫిర్యాదును దాఖలు చేశారు... దానిపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఇప్పుడు అసలు సంగతి చూడండి. పార్లమెంట్‌లో రాధాకృష్ణన్ చెప్పిన అబద్ధాల విషయంలో ప్రభుత్వం ఎలా మాట మార్చిందో మేము దొరకబుచ్చుకున్నాము. ఆఖరికి హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుకు ఇచ్చిన జవాబులోకూడా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించలేదు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నింటినీ చదివితే స్పష్టంగా ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎలక్టొరల్ బాండ్స్‌ విషయంలో ప్రతికూలత వ్యక్తంచేసిన ఎన్నికల సంఘం నోరు నొక్కేయటానికి మోది ప్రభుత్వం ఎందుకు అంతగా ప్రయత్నించింది?

ఎన్నికల సంఘం లేవనెత్తిన ప్రశ్నలు అన్నింటికీ వివరంగా సమాధానం ఇవ్వలేకపోతున్నామని, వచ్చే ఏడాది బడ్జెట్ రూపకల్పనలో తాము తలమునకలుగా ఉన్నామని, అయితే ఈ నిర్ణయం మాత్రం "మంచి ఉద్దేశ్యం"తో తీసుకున్నదని ఆర్థిక మంత్రిత్వశాఖ తన ఈ మెయిల్ జవాబులో పేర్కొంది.

"ఈ మెయిల్‌లో లేవనెత్తిన అంశాలు అన్నీ నాడు విధులలో ఉన్న సమర్థులైన ఉన్నతాధికారులు తీసుకున్న విధాన నిర్ణయాలకు సంబంధించినవే. ప్రభుత్వ సంస్థలలో నిర్ణయాలు అన్నీ మంచి ఉద్దేశ్యంతో, ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడాలనే తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాలను వేర్వేరు రకాలుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, అందువలన నిర్ణయాలు తీసుకోవటంలో ఏఏ విషయాలను పరిగణించామనే విషయాన్ని అధ్యయనం చేసిన తర్వాతమాత్రమే తగిన సంజాయిషీ ఇవ్వాల్సిఉంటుంది" అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ఈమెయిల్‌లో పేర్కొంది.

ఈసీ అభ్యంతరాలను కప్పిపుచ్చే ప్రయత్నం

ఎలక్టొరల్ బాండ్స్ అనేవి విదేశీ సంస్థలు/వ్యక్తులనుంచి అక్రమంగా విరాళాలు సేకరించటానికి రాజకీయపార్టీలకు ఉపయోగపడతాయని హెచ్చరిస్తూ భారత ఎన్నికల సంఘం కేంద్ర న్యాయమంత్రిత్వశాఖకు 2017 మే నెలలో లేఖ రాసింది. అక్రమార్కులు తమ ఆదాయ వనరులను వెల్లడించకుండానే డొల్ల కంపెనీలు పెట్టి తమ నల్లధనాన్ని రాజకీయ నాయకులకు పంపటానికి ఈ బాండ్స్ ద్వారా అవకాశం కలుగుతుందని పేర్కొంది.

రాజకీయపార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పెంచటానికి చేశామని ప్రభుత్వం చెబుతున్న ఈ ఎలక్టొరల్ బాండ్స్‌ను, చట్టాలకు చేసిన సవరణలను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!

2018 అక్టోబర్ నాటికికూడా, ఈ బాండ్‌లను, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర పారదర్శకత రహిత చట్ట సవరణలను వెనక్కు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తూనే ఉందని చట్టాలు మరియు న్యాయశాఖా మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే కమిషన్ రాతపూర్వకంగా చేసిన ఈ సూచనలను ఆర్థిక మంత్రిత్వశాఖ పట్టించుకోలేదని రికార్డులు చూపుతున్నాయి.

ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు, ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులకు మధ్య జరిగిన ముఖాముఖి సమావేశాలు, ఇరుపక్షాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల రికార్డులు అన్నీ గమనిస్తే, ఎలక్టొరల్ బాండ్స్ పథకంపై ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాల గురించి ఆర్థిక మంత్రిత్వశాఖకు స్పష్టంగా తెలుసని అర్థమవుతోంది.

అయితే ఇంత స్పష్టంగా ఉంటే, 2018 పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ నిండు సభలో ఎంతో బలంగా, "ఎలక్టొరల్ బాండ్స్ పథకం విషయంలో ఎన్నికల సంఘం ఎటువంటి అభ్యంతరాలనూ తమముందు వ్యక్తం చేయలేదు" అని ఎందుకు చెప్పారనే విషయం మాత్రం అర్థం కావటంలేదు.

ఎన్నికల సంఘం చట్టాలు మరియు న్యాయ మంత్రిత్వ శాఖకు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు పారదర్శకత కార్యకర్త బాత్రా బయటపెట్టటంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని హక్ ఒక హక్కుల ఉల్లంఘన నోటీసును పంపారు. దీనికి జవాబు ఇవ్వాలంటూ రాజ్యసభ సెక్రెటేరియట్ ఆర్థిక మంత్రిత్వశాఖకు 2018 డిసెంబర్ 28న ఒక లేఖ రాసింది.

పొన్ రాధాకృష్ణన్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినట్లు తేలటంతో ఆర్థిక మంత్రిత్వశాఖ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలాగా తయారయింది.

నిజాలను కప్పిపుచ్చటంకోసం మళ్ళీ అనేక అబద్ధాలు చెప్పాల్సివచ్చింది.

ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ కార్యదర్శి గార్గ్ ఈ విషయంపై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కలిసి చర్చించినందున ఎన్నికల సంఘం తన అభ్యంతరాలను రాతపూర్వకంగా తన అభ్యంతరాలను వ్యక్తం చేయలేదని చెప్పిఉండొచ్చని ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని మొదటినుంచీ పర్యవేక్షిస్తున్న విజయ్ కుమార్ అనే డిప్యూటీ డైరెక్టర్ 2019 జనవరి 1న సూచించారు. కాబట్టి సహాయ మంత్రి రాధాకృష్ణన్ పార్లమెంట్‌లో అబద్ధం చెప్పినట్లు అవ్వదని విజయ్ కుమార్ తన సీనియర్‌లకు సలహా ఇచ్చారు.

ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!

ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ కార్యదర్శి గార్గ్ తన సిసలైన బ్యూరోక్రాట్ శైలిలో లౌక్యపూర్వకమైన మరో కొత్త వాదన తీసుకొచ్చారు.

రాధాకృష్ణన్ పార్లమెంట్‌లో తప్పు ప్రకటన చేశారని మొదట ఆయన ఒప్పుకున్నారు. 2019 జనవరి 2న ఆయన తన అభిప్రాయాలను ఇలా రాశారు. "మంత్రి సమాధానం చెబుతూ ఫ్లోలో అలా మాట్లాడారు. ఎన్నికల సంఘంనుంచి ఎలాంటి అభ్యంతరమూ రాలేదని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఆర్థిక మంత్రిత్వశాఖకు ఎలాంటి అభ్యంతరమూ అందకపోతే పైన పేర్కొన్న అంశాల నేపథ్యంలో అది నిజమే అయిఉండొచ్చు."

ఆయన రెండు మార్గాలను సూచించారు:

"ప్రభుత్వం తన జవాబులోని (డి) మరియు (ఇ) భాగాలను ఆర్థిక మంత్రిత్వశాఖకు ఉద్దేశించి పేర్కొన్నదని మంత్రికి స్పష్టీకరించాలి లేదా ఈ విషయానికి సంబంధించి సరైన వాస్తవాలను వివరిస్తూ సభలో ఒక ప్రకటన చేయాలి. దయచేసి పరిశీలించి ఆర్థిక మంత్రితో చర్చించండి" అని ఆయన రాశారు.

తన ఉన్నతాధికారి చేసిన సూచనల మేరకు, బడ్జెట్ డివిజన్ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించే గార్గ్ కింద అధికారి మంత్రి అబద్ధం చెప్పలేదని చెప్పటానికి మూడు సాకులను తయారు చేశారు.

వీటిలో రెండు బ్యూరోక్రటిక్ పదజాలం ఆధారంగా తయారు చేసినవికాగా, మూడోది మసిబూసి మారేడుకాయ చేసేవిధంగా ఉంది. "ఎలక్టొరల్ బాండ్స్ విషయంలో భారత ఎన్నికల సంఘానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకూ మధ్యలో ఎలాంటి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలూ జరగలేదు. 2017 మే 26న ఎన్నికల సంఘం రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ ఆధారంగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలాంటి లేఖ అసలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు రానే లేదు. కాబట్టి దినపత్రికలలో పేర్కొన్న లేఖను పరిశీలించే అవకాశం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు కలగలేదు."

ఇది పూర్తిగా అబద్ధం. మిగిలిన మీడియా కథనాలు పేర్కొన్నట్లుగా, ఎన్నికల సంఘం రాసిన లేఖ ఆర్థిక మంత్రిత్వశాఖకు చేరింది, ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ కార్యదర్శి గార్గ్ వ్యక్తిగతంగా 2018 జులై 28న ఎలక్షన్ కమిషనర్‌‍లను కలుసుకుని ఎలక్టొరల్ బాండ్స్‌పై వ్యక్తమైన అభ్యంతరాల గురించి చర్చించారు.

ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!
ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!

2019 జనవరి 12న కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్ హక్‌కు జవాబు ఇచ్చారు, "ఎలక్టొరల్ బాండ్స్ పథకంపై భారత ఎన్నికల సంఘంనుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి అధికారిక లేఖకూడా రాలేదు. నేను గతంలో చెప్పిన జవాబుకు అర్థం - ఎన్నికల సంఘంనుంచి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ అందలేదు అంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఎలాంటి అభ్యంతరమూ వ్యక్తం కాలేదని మాత్రమే. పార్లమెంట్‌ను తప్పదోవ పట్టించటానికి ఎలాంటి ప్రయత్నమూ జరగలేదని నేను హామీ ఇస్తున్నాను, ఎలక్టొరల్ బాండ్స్ పథకం ఖచ్చితంగా పారదర్శకమైనదే."

ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!

ఈ కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్నికూడా బాత్రా బయటపెట్టారు. చట్టాలు మరియు న్యాయ మంత్రిత్వశాఖ ద్వారా ఆర్థిక మంత్రిత్వశాఖకూడా ఎన్నికల సంఘం అభ్యంతరాలతో కూడిన లేఖను అందుకున్నట్లు ఆయన కనుగొన్నారు. ఎలక్టొరల్ బాండ్స్‌ పథకానికి సంబంధం ఉన్న మంత్రిత్వ శాఖలు అన్నింటికీ ఎన్నికల సంఘం లేఖ అందింది.

ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ కింద ఉండే ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ అండ్ లెజిస్లేషన్ విభాగం ఈ బాండ్స్ పథకం అమలును పర్యవేక్షిస్తోంది. ఆ విభాగానికి కూడా ఈ లేఖ చేరింది, ఆ విభాగం ఎన్నికల సంఘం అభ్యంతరాలతో ఏకీభవించింది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ఈ అభ్యంతరాలకు స్పందించలేదు. అలా స్పందించినట్లయితే కమిషన్ అభ్యంతరాలను గుర్తించినట్లు ఒప్పుకోవాల్సి వస్తుందని అయిఉండొచ్చు.

ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ కార్యదర్శితో ముఖాముఖిగా సమావేశం అయినప్పటికీ బాండ్స్ పథకాన్ని ఎలక్షన్ కమిషనర్‌లు మొదటినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారని పత్రాలను బట్టి అర్థమవుతోంది.

ఎలక్టొరల్ బాండ్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ 2019 మార్చిలో సుప్రీమ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయటంతో, ఈ పథకానికి కమిషన్ వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రజలందరికీ బాహాటంగా తెలిసింది. అయితే అప్పటికే, రు.1,400 కోట్ల విలువైన ఎలక్టొరల్ బాండ్స్‌ను కార్పొరేట్ సంస్థలు కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చేశాయి.

2019 ఆగస్ట్‌లో ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నించారు. హక్ ప్రశ్నకు 'సరిదిద్దిన జవాబు'ను ఆమె పార్లమెంట్‌లో పెట్టారు.

ఆ సరిదిద్దిన జవాబు ప్రస్తుతం పార్లమెంట్ రికార్డులలో చేరింది. ఎలక్టొరల్ బాండ్స్‌పై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు గుర్తించామని దానిలో పేర్కొన్నారు. నిజాలను కప్పిపుచ్చటానికి బ్యూరోక్రటిక్ పదజాలంతో ఈసారి ఆర్థక మంత్రిత్వశాఖ ప్రయత్నాలు చేయలేదు.

అయితే హక్ అడిగిన అసలు ప్రశ్నలోని కీలక అంశాన్నిమాత్రం సీతారామన్ నేరుగా దాటవేశారు: ఎన్నికలసంఘం అభ్యంతరాల విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది?

ఈ ప్రశ్నకు సమాధానంగా, రెండేళ్ళనుంచి ప్రభుత్వం నడుపుతున్న ఈ పథకంలోని ముఖ్యమైన అంశాలనే సమాధానంగా మంత్రి పేర్కొని తప్పించుకున్నారు.

ఎవరు గమనిస్తున్నారు?

ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని ప్రారంభించేటప్పుడు ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని, రిజర్వ్ బ్యాంక్‌ను మాత్రమే కాదు రాజకీయ పార్టీలను కూడా సంప్రదించినట్లు కలర్ ఇచ్చింది. ఈ విషయాన్నికూడా రహస్య పత్రాలు తెలుపుతున్నాయి.

2017 మార్చి 2న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలక్టొరల్ బాండ్స్ పథకం అమలుపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతూ దేశంలోని ప్రతిపక్షాలు అన్నింటికీ లేఖలు రాశారు.

పలువురు ప్రతిపక్ష నేతలు ఆ లేఖలకు జవాబులు ఇచ్చారు.

"రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు నేను గమనించాను" అని కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కోశాధికారిగా ఉన్న మోతీలాల్ ఓరా రాశారు. "పారదర్శకత అంటే, 1) విరాళం ఇచ్చిన దాత 2) విరాళం తీసుకున్న పార్టీ 3) విరాళంగా ఇచ్చిన మొత్తం అనే విషయాలను ఓటర్ తెలుసుకోగలగటం."

"ఆర్థిక మంత్రి ప్రసంగం, బహిరంగ వ్యాఖ్యలనుబట్టి చూస్తే దాతల పేర్లు బాండ్లను జారీచేసే బ్యాంకుకు మాత్రమే తెలుస్తాయని, విరాళాల గ్రహీతల పేర్లు ఆదాయపు పన్ను శాఖకు మాత్రమే తెలుస్తాయని అర్థమవుతోంది. అంటే దాతలు, గ్రహీతల పేర్లు ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తాయి, ప్రజలకు తెలియవు" అని ఓరా అన్నారు.

పథకాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే తాము పూర్తి స్థాయిలో వ్యాఖ్యానించగలుగుతామని ఓరా పేర్కొన్నారు.

ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న ఈ పథకం ముసాయిదానుగానీ, వివరాలనుగానూ అందజేసి ఉంటే బాగుండేదని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అభిప్రాయపడ్డారు.

ఈ పథకం పారదర్శకతను తీసుకొస్తుందన్న వాదనను తమ పార్టీ నమ్మకపోవటానికి ఒక విస్తృతమైన వివరణను సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఇచ్చారు. ఈ పథకంకోసం చట్టాలకు చేసిన సవరణలు విరాళాలు ఇచ్చే కార్పొరేట్ సంస్థల అధిపతుల సమాచారాన్ని రహస్యంగా ఉంచటంకోసంమాత్రమేనని అన్నారు.

ఈ రహస్య రాజకీయ బాండ్స్ పథకాన్ని, దీనికోసం చట్టాలకు చేసిన సవరణలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ సవరణలను రద్దుచేయాలని, రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలపై ఒక పరిమితి విధించాలని సూచించారు.

అయితే బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) మాత్రం, రాజకీయ విరాళాల విషయంలో పారదర్శకతకోసం ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక చరిత్రాత్మక అడుగు అని పేర్కొంటూ అభినందనలు తెలిపింది. అయితే, లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు తమ లాభాలలో కొంత శాతాన్ని ఏదైనా పార్టీకి ఎలక్టొరల్ బాండ్స్ ద్వారా విరాళంగా ఇవ్వటానికి అవకాశం కల్పిస్తే మరింత నైతికంగా ఉంటుందని ఎస్ఏడీ కార్యదర్శి దల్జిత్ సింగ్ చీమా వ్యాఖ్యానించారు.

ఎలక్టొరల్ బాండ్స్: పార్లమెంట్‌లో మోది ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఇలా బట్టబయలు!

అయితే ఎస్ఏడీ పార్టీ చేసిన సూచనలకు పూర్తి విరుద్ధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో బీజేపీ వ్యవహరించింది - మూడేళ్ళపాటు ఒక కంపెనీ ఆర్జించిన లాభాలలో 7.5% వరకు డబ్బును కార్పొరేట్ సంస్థలు విరాళంగా ఇవ్వొచ్చని గతంలో ఉన్న పరిమితిని ప్రభుత్వం తొలగించింది.

ప్రతిపక్షాలలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, మరికొందరు మరింత సమాచారం కావాలని కోరినా ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వాధినేతలు సూచించినట్లుగానే ఎలక్టొరల్ బాండ్స్ పథకానికి రూపకల్పన చేశారు. ఆ పని పూర్తయిన తర్వాత, ముసాయిదా ప్రతిని అన్ని పార్టీల నేతలకూ పంపమంటారా అని నాటి ఆర్థిక మంత్రిని అడిగారు. ఆ ప్రశ్నకు జైట్లీ మౌనం వహించారు, పరోక్షంగా ఆ వివరాలను పార్టీలకు తెలియజేయవద్దని సూచిస్తూ.

ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలతో చర్చలు, సంప్రదింపుల తర్వాతే రూపొందించామని చెప్పుకోవటంకోసం మొక్కుబడి కసరత్తు చేసిన ప్రభుత్వం చివరికి తాను అనుకున్నట్లుగానే ఈ పథకాన్ని రూపొందించింది.

(అనువాద: శ్రావణ్ బాబు)

(ఈ కథనం ఆంగ్ల మూలం మొదట 'హఫింగ్టన్ పోస్ట్ ఇండియా' వెబ్‌సైట్‌లో ప్రచురితమయింది - Link)

The Lede
www.thelede.in