గడువు చెల్లిపోయిన ఎలక్టొరల్ బాండ్స్ ను కూడా స్వీకరించేటట్లు స్టేట్ బ్యాంకుకు కేంద్రం ఆదేశాలు
The Lede Telugu

గడువు చెల్లిపోయిన ఎలక్టొరల్ బాండ్స్ ను కూడా స్వీకరించేటట్లు స్టేట్ బ్యాంకుకు కేంద్రం ఆదేశాలు

హంగ్ అసెంబ్లీ ఏర్పడిన కర్ణాటకలో 2018 లో ఎన్నికలు ముగిసిన వెంటనే రు.10 కోట్ల విలువైన బాండ్లు మార్చుకోబడ్డాయి

Nitin Sethi

Nitin Sethi

కేంద్ర ఆర్థికశాఖ ఈ ఎలక్టొరల్ బాండ్స్ విషయంలో నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించిన మరో సందర్భం, దాని వివరాలను ఇప్పుడు చూద్దాం. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన వెంటనే గడువు ముగిసిపోయిన రు.10 కోట్ల ఎలక్టొరల్ బాండ్స్ ను అజ్ఞాత దాతలు ఒక రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వటానికి కేంద్ర ఆర్థికశాఖ అనుమతిని మంజూరు చేసింది.

ఈ గడువు చెల్లిపోయిన బాండ్లు కలిగిఉన్న రాజకీయ పార్టీలు, ఈ బాండ్లను స్వీకరించాలంటూ - ఈ బాండ్ల పథకాన్ని పర్యవేక్షించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను - అభ్యర్థించటంతో ఆర్థిక శాఖ తదనుగుణంగా బ్యాంకుకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపే రహస్య పత్రాలు 'ద లీడ్'కు లభించాయి.

అసలు ఈ ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకాలే నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. కర్ణాటక ఎన్నికలు జరగటానికి కొద్దిరోజులముందు ఎలక్టొరల్ బాండ్స్ ను ప్రత్యేక అమ్మకాల ద్వారా విక్రయించాలంటూ సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దానితో దానికి అనుగుణంగా ఆర్థికశాఖ ఈ పథకం నిబంధనలకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.

అయితే పారదర్శక కార్యకర్త కమాండర్ లోకేష్ బాత్రా(రిటైర్డ్) సమాచారహక్కు చట్టం కింద సేకరించిన కీలక పత్రాలలో గడువుతీరిన ఎలక్టొరల్ బాండ్స్ స్వీకరించిన దాతలు లేదా పార్టీల పేర్లు మాత్రం లేవు.

కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కొనుగోళ్ళు చేయటానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రధాని మోదికి చెందిన బీజేపీ నాయకులు, ప్రతిపక్షాల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.

గడువుతీరిన ఎలక్టొరల్ బాండ్స్ ను స్వీకరించటం, అదికూడా రాజకీయంగా కీలక తరుణంలో ఇది జరగటం ఈ పథకం మౌలిక సూత్రానికే పూర్తి విరుద్ధం. రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం, ప్రతిపక్ష పార్టీలు, పారదర్శక కార్యకర్తలు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి స్వచ్ఛంద నిఘా సంస్థలు ఈ బాండ్స్ పథకాన్ని ఎందుకు వ్యతిరేకించాయో ఇప్పటికైనా అందరికీ స్పష్టంగా అర్థమవ్వాలి.

ఎలక్టొరల్ బాండ్స్ తొలిదఫా అమ్మకాలలో 95% డబ్బు బీజేపీకే తరలటాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిఉంది.

ఈ బాండ్స్ కు ఉన్న చట్టబద్ధత గురించి ప్రస్తుతం సుప్రీమ్ కోర్టులో ఒక పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ పథకంపై చర్చకై డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల ఎంపీలు ఇటీవలి పార్లమెంట్ సమావేశాలలో సభను అడ్డుకున్నారు. ఆ సమయంలో సభలోనే ఉన్న ప్రధాని మోది మాత్రం తనదైన శైలిలో మౌనంగా చూస్తుండిపోయారు.

నిబంధనల అతిక్రమణ

2017 మార్చి నెలలో నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మొట్టమొదటగా ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టినపుడు, నల్లధనం చెలామణిలోకి తేవటానికి ఇది వాడుకోబడుతుందని రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఈ పథకం ఇలా పనిచేస్తుంది: పత్రాల రూపంలో ఉండే ఈ ఎలక్టొరల్ బాండ్స్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్ముతుంది. ఏ వ్యక్తి అయినా, వ్యాపారసంస్థ అయినా, ట్రస్ట్ అయినా, స్వచ్ఛంద సంస్థ అయినా ఏదైనా రాజకీయపార్టీకి విరాళం ఇవ్వదలుచుకుంటే ఈ బాండ్స్ కొనుగోలు చేసి వారికి అందజేయవచ్చు. ఆ బాండ్స్ అందుకున్న పార్టీ వాటిని నిర్దేశించిన ఒక ప్రత్యేక ఖాతాలో జమచేసుకోవచ్చు.

ఇంతకుముందు పేర్కొన్నట్లుగా, రిజర్వ్ బ్యాంక్ చివరిదాకా ఈ పథకాన్ని వ్యతిరేకించింది. ఎంత చేసినా తమ మాటను పట్టించుకోకపోవటంతో, నల్లధనం అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే రెండు విషయాలలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది: బాండ్స్ ను సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే అమ్మాలని, అదికూడా ఒక నియమిత కాలవ్యవధిలో మాత్రమే అమ్మాలని సూచించింది. ఈ బాండ్స్ ను విరాళంగా అందుకున్న రాజకీయ పార్టీలు వాటి కొనుగోలు జరిగిన 15 రోజులలోగా డిపాజిట్ చేయాలని పేర్కొంది.

2018 జనవరిలో కేంద్ర ఆర్థికశాఖ ఈ బాండ్లకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్ళ నిబంధనలను ప్రచురించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని సంవత్సరానికి 4 పర్యాయాలు(సాధారణ ఎన్నికలు జరిగే సంవత్సరంలో అదనంగా 30 రోజులు) అమ్మకాలు జరపాలి, కొనుగోలు చేసిన 15 రోజులలోగా వాటిని మార్చుకోవాలి అని స్పష్టంగా ఆ నిబంధనలలో పేర్కొంది.

కానీ, 2018 మే నెలలో, సరిగ్గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ముందు, 'ద లీడ్' ఇంతకుముందు పేర్కొన్నట్లు, ప్రధాని మోది కార్యాలయం మే 1 నుంచి మే 10 వరకు ప్రత్యేకంగా ఎలక్టొరల్ బాండ్స్ అమ్మకానికి అనుమతి మంజూరు చేయాలని ఆర్థికశాఖను ఆదేశించింది.

2018 మే 23న స్టేట్ బ్యాంక్ కేంద్ర ఆర్థికశాఖకు ఒక నివేదిక పంపింది… రు.20 కోట్ల విలువైన ఎలక్టొరల్ బాండ్స్ కలిగిఉన్న కొందరు(కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు) ఢిల్లీలోని తమ బ్యాంక్ మెయిన్ బ్రాంచికి వెళ్ళారని, తమ పార్టీ ఖాతాలలో వాటిని డిపాజిట్ చేసుకోవాలని కోరారని తెలిపింది.

సదరు రు.20 కోట్ల బాండ్స్ లో సగమేమో 2018 మే 3న కొనుగోలు చేయబడగా, మిగిలన సగం మే 5న కొనుగోలు చేసినవని, కొని 15 రోజులు దాటిపోవటంతో వాటికి మొత్తానికికూడా గడువు చెల్లిపోయిందని స్టేట్ బ్యాంక్ తెలిపింది.

అయితే, 15 రోజుల కాల వ్యవధి అనే నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని, ఎలాగోలా తమ వద్ద ఉన్న రు.20 కోట్ల బాండ్ లను నగదులోకి మార్చుకునేందుకు వీలు కల్పించాలని సదరు వ్యక్తులు తమను అభ్యర్థించినట్లు బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ దీనిగురించి అదే రోజున తమ కార్పొరేట్ ప్రధాన కార్యాలయానికి తెలియజేసినట్లు 'ద లీడ్'కు లభించిన పత్రాలు తెలుపుతున్నాయి. మరసటిరోజు, అంటే 2018 మే 24న స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ రజనీష్ కుమార్ తరపున బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మృత్యుంజయ్ మహాపాత్ర కేంద్ర ఆర్థిక శాఖకు ఒక లేఖ రాస్తూ, గడువు తీరిన ఈ బాండ్స్ ను నగదుగా మార్చుకోవటానికి అనుమతి ఇవ్వాలా వద్దా అని అడిగారు.

“కొనుగోలు చేసి15 కార్యాలయ దినాలు పూర్తి కాలేదు కాబట్టి తమ వద్ద ఉన్న రు.20 కోట్ల బాండ్ లను మార్చుకోవటానికి అనుమతించాలని కోరుతూ వారు తమను ఆశ్రయించారు. ఈ బాండ్ ల గడువును 15 కార్యాలయ దినాలుగా చూడాలా లేక 15 క్యాలెండర్ దినాలుగా చూడాలా అనే విషయమై స్పష్టతను ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాము," అంటూ మహాపాత్ర తన లేఖలో ఆర్థిక శాఖ అధికారులను కోరారు.

కేంద్ర ఆర్థికశాఖ చురుకుగా స్పందించింది. అదే రోజున ఒక ఉన్నతాధికారి ఆ లేఖకు జవాబు ఇచ్చారు.

"ఈ బాండ్ ల కాలపరిమితి 15 రోజులలో కార్యాలయం పనిచేయని దినాలుకూడా కలిపి పరిగణించాల్సి ఉంటుంది" అని ఆర్థికశాఖలోని ఎకనామిక్ ఎఫైర్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

సాధారణంగా, నిబంధనల ప్రకారం గడువు తీరిన బాండ్స్ కు సంబంధించిన డబ్బును ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి ఇచ్చేయాల్సి ఉంటుంది.

కానీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ అంతటితో ఊరుకోలేదు.

"అయితే గతంలో జరిపిన అమ్మకాల సందర్భంగా ఈ విషయంలో పూర్తి స్పష్టత లేనందున 2018 మే 10కు ముందు కొనుగోలు చేసిన బాండ్స్ కనుక 15 కార్యాలయ దినాలలోగా డిపాజిట్ చేసిఉన్నట్లయితే వాటిని మార్చుకోవటానికి స్టేట్ బ్యాంక్ అనుమతి ఇవ్వొచ్చు" అని కుమార్ పేర్కొన్నారు. "కానీ, భవిష్యత్తులో మాత్రం ఇలాంటి అవకాశం ఇవ్వబడదు" అనికూడా రాశారు.

ఆ లేఖను ఎకనామిక్ ఎఫైర్స్ విభాగానికి చెందిన అత్యున్నత అధికారి, కార్యదర్శి ఎస్.సి.గార్గ్ ఆమోదించారు. స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ కు అదే రోజు ఈ లేఖ పంపారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఢిల్లీ మెయిన్ బ్రాంచికి ఈ విషయాన్ని తెలియజేసింది, ఆ నాడే, రోజు ముగియకముందే, సదరు రాజకీయ పార్టీ 2018 మే 5న కొనుగోలు చేసిన రు.10 కోట్ల బాండ్ లను నగదుగా మార్చుకుంది.

ఆ రు.20 కోట్లలో మే 3న కొనుగోలు చేసిన రెండో సగం ఆర్థికశాఖ ఇచ్చిన ప్రత్యేక "అనుమతి"కిందకు రాకపోవటంతో వాటిని ప్రధానమంత్రి సహాయనిధికి పంపినట్లు రికార్డులు చూపుతున్నాయి.

"ఇంత అత్యవసరంగా కేంద్ర ఆర్థికశాఖ స్పందించి లబ్ది చేకూర్చిన ఆ రాజకీయ పార్టీ ఏది" అని ఈ పత్రాలను బయటకు తీసిన పారదర్శక కార్యకర్త కమాండర్ లోకేష్ బాత్రా(రిటైర్డ్) ప్రశ్నించారు.

ఆయన ప్రశ్నలకు జవాబు, మరికొన్ని రహస్యాలు ఇంకా ప్రజలకు తెలియకుండా రహస్యంగానే ఉండిపోయాయి.

కేంద్ర ఆర్థిక శాఖకు ఈ విషయమై పంపిన ప్రశ్నలకు స్పందన లభిస్తే దీనిపై తాజా సమాచారాన్ని ఇక్కడ పొందుపరుస్తాము.

(అనువాదం: శ్రవణ్ బాబు)

(ఈ కథనం మొట్ట మొదట హఫింగ్టన్ పోస్ట్ ఇండియా వెబ్ సైట్ లో ప్రచురితమయింది - Link)

(Read Part 1, 2 and 3 here.)

The Lede
www.thelede.in