ఎలక్టొరల్ బాండ్స్: అబద్ధాలు చెప్పినట్లు అంగీకరించిన కేంద్రం
The Lede Telugu

ఎలక్టొరల్ బాండ్స్: అబద్ధాలు చెప్పినట్లు అంగీకరించిన కేంద్రం

విరాళాలు ఇచ్చే దాతలు తమ సమాచారాన్ని రహస్యంగా ఉంచాలని కోరినట్లు చెప్పటం అంతా అబద్ధమని ఓ సమాచారహక్కు దరఖాస్తుద్వారా తేలింది

Nitin Sethi

Nitin Sethi

రహస్య విరాళాల ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టే సందర్భంలో, 2017 జనవరిలో, నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇలా సమర్థించుకున్నారు: "చెక్కులు, ఇతర పారదర్శక మార్గాలద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తే తమ వివరాలు బయటకు తెలిసిపోతాయని, దీనివలన తాము ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ దాతలు నిరాసక్తత వ్యక్తం చేశారు" అని చెప్పారు.

ఈ గుర్తుతెలియని దాతలు చెప్పిన విషయాన్ని అప్పటినుంచి బీజేపీ నేతలు తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎలక్టొరల్ బాండ్స్ విషయమై దర్యాప్తు గురించి ఇటీవలి మీడియా సమావేశంలోకూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

“రాజకీయపార్టీలకు బహిరంగంగా విరాళాలు ఇస్తే రాజకీయ కక్షసాధింపులకు ఎదుర్కోవలసి వస్తుందేమోనంటూ దాతలు నిరాసక్తత వ్యక్తం చేసేవారు” అని గోయల్ మీడియా సమావేశం జరిగిన వెంటనే బీజేపీ ప్రతినిధులు పంచిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

నాటి జైట్లీ ప్రసంగం జరిగిన మూడేళ్ళ తర్వాత, రు.6,108.47 కోట్ల బాండ్లను రహస్య దాతలు రాజకీయపార్టీలకు విరాళంగా ఇచ్చిన తర్వాత, ఏ దాతకూడా విరాళాలు ఇవ్వటానికి రహస్య విధానాన్ని ఏర్పాటు చేయాలంటూ ఎన్నడూ ప్రభుత్వాన్ని కోరలేదని ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఒప్పుకుంది.

“రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేటపుడు తమ సమాచారాన్ని రహస్యంగా ఉంచాలని కోరుతూ దాతలనుంచి ఎటువంటి పిటిషన్ గానీ, రాతపూర్వక అభ్యర్థనగానీ తమకు రాలేదు” అని వెంకటేష్ నాయక్ అనే సమాచారహక్కు కార్యకర్త దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కేంద్ర ఆర్థికశాఖ అబద్ధాన్ని చెప్పినట్లు ఒప్పుకోవటం అనేది స్వచ్ఛందంగా జరగలేదు, సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా మాత్రమే ఇది బయటకు వచ్చింది. వెంకటేష్ నాయకు 2017 జులైలో ఈ దరఖాస్తును దాఖలు చేశాడు. చట్టం ప్రకారం, ఆర్థికశాఖ 30రోజులలోగా సమాధానం ఇవ్వాల్సిఉంటుంది. కానీ, నాయక్ దరఖాస్తుకు ఒక నెలరోజులపాటు ఎలాంటి సమాధానం లభించలేదు. దీనిపై నాయక్ అప్పీల్ చేసుకోగా, జాగు చేయటంకోసం ఆర్థిక మంత్రిత్వశాఖ మరో ఎత్తు వేసింది. నాయక్ దరఖాస్తును ఐదు నెలలపాటు ఒక శాఖనుంచి మరో శాఖకు తిప్పుతూ కాలయాపన చేసింది.

వెంకటేష్ నాయక్ చివరికి 2018 జనవరిలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ను ఆశ్రయించారు. వెంటనే నాయక్ దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలని కమిషన్ కేంద్ర ఆర్థికశాఖను ఆదేశించింది. అప్పుడు కూడా అతను సమాధానం పొందటానికి మరో సంవత్సరం, పదినెలల సమయం పట్టింది: రాజకీయపార్టీలకు విరాళం ఇవ్వటానికి రహస్య మార్గం ఏర్పాటు చేయాలంటూ ఎవరూ ప్రభుత్వాన్ని కోరలేదు అన్నది ఆ సమాధానం. ఎలక్టొరల్ బాండ్స్ కు చట్టబద్ధతకోసం మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో మరో అబద్ధం చెప్పినట్లు బయటపడింది.

ఓవైపు, ఎలక్టొరల్ బాండ్స్ విషయంలో రహస్యమార్గం కావాలంటూ లాంఛనప్రాయంగా ఎలాంటి రాతపూర్వక దరఖాస్తూ నరేంద్రమోది ప్రభుత్వానికి అందలేదని సమాచార హక్కు కార్యకర్త వెంకటేష్ నాయక్ దరఖాస్తు ద్వారా బయటపడగా, మరో సమాచార హక్కు కార్యకర్త కమాండర్ లోకేష్ బాత్రా(రిటైర్డ్) ఇదే బాండ్స్ కు సంబంధించి దాఖలు చేసిన దరఖాస్తుకు మాత్రం, ఊరూ, పేరూ లేని ఒక వ్యక్తినుంచి విరాళాలకోసం రహస్యమార్గం కావాలంటూ ఒక దరఖాస్తు అందినట్లు జవాబు వచ్చింది.

ఆ దరఖాస్తు ఏ విధమైన తేదీ, స్టాంప్, లెటర్ హెడ్ లేని ఒక తెల్లకాగితంపై ముద్రించి ఉంది.

ఈ రహస్యదరఖాస్తుపై స్పందిస్తూ, "ఊరూ, పేరూ లేని అటువంటి పత్రాలను ప్రభుత్వ రికార్డుల వ్యవస్థలు అంగీకరించవు" అని కేంద్ర ఆర్థికశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. తనపేరును వెల్లడించవద్దని ఆయన కోరారు. రహస్య విరాళాల గురించి ఆ కాగితంపై సూచనప్రాయంగా చెప్పటమో, సలహా ఇవ్వటమో చేసి ఉంటారు. ఎకనామిక్ ఎఫైర్స్ శాఖ రెవెన్యూ శాఖను అడిగినట్లుగా అన్ని శాఖలనూ దీనిగురించి అడగలేదని తెలిపారు. దీనిపై రెవెన్యూశాఖ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. ఈ బాండ్స్ పథకం రూపురేఖలపై కసరత్తు చేస్తూ రాసిన పత్రాలు అందుబాటులో లేవని వెల్లడించారు.

సమాచారహక్కు కార్యకర్త లోకేష్ బాత్రా బయటపెట్టిన పత్రాలు సమాచార హక్కు చట్టం బలాన్ని చాటిచెబుతోంది. అదే చట్టాన్ని నీరుగార్చటంకోసం మోది ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

"ఎన్నికల విరాళాలలో పారదర్శకతకోసం ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వంగానీ, ఇతర రాజకీయ పార్టీలుగానీ 2013నాటి సీఐసీ ఆదేశాలను పాటించటానికి నిరాకరించటం చాలా దారుణం" అని లోకేష్ బాత్రా అన్నారు.

రాజకీయ పార్టీలు అన్నీ సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకొస్తూ సీఐసీ 2013లో జారీచేసిన ఆదేశాలే రాజకీయ విరాళాలలో పారదర్శకతకు సరిపోతాయని బాత్రా చెప్పారు. అందుకే తాను రాజకీయ విరాళాలలో పారదర్శకతపై నాటి కేంద్ర ఆర్థికమంత్రి ప్రతిపాదన గురించి తెలుసుకోవాలని తనకు ఆలోచన వచ్చిందని తెలిపారు.

బాత్రా సమాచారహక్కు దరఖాస్తుతో వెలికితీసిన పత్రాలద్వారా - రిజర్వ్ బ్యాంక్, ఎన్నికల సంఘం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎలక్టొరల్ బాండ్స్ ను ఎంత వ్యతిరేకించాయో బయటపడింది. మోది ప్రభుత్వంలోని మంత్రులు ఈ బాండ్లపై ఎలా అబద్ధాలు చెప్పారో తెలిసింది. ఎలక్టొరల్ బాండ్స్ ప్రత్యేక అమ్మకాలకోసం మోది ప్రభుత్వం ఆర్థికశాఖ నిబంధనలను ఎలా మార్చివేసిందీ బయటపడింది. గడువు తీరిపోయిన బాండ్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ఆర్థికశాఖ తన నిబంధనలను తానే ఎలా ఉల్లంఘించిందనే విషయంకూడా వెలుగుచూసింది.

ఈ బయటపడిన కఠోర వాస్తవాలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి:

  • ఈ ఎలక్టొరల్ బాండ్స్ పథకాన్ని కేంద్ర ఆర్థికశాఖలోని ఏ విభాగం రూపొందించింది, ఎలా?

  • ఎలక్టొరల్ బాండ్స్ పథకంకోసం వివిధ చట్టాలకు సవరణలు చేసే సమయంలో ఆనవాయితీ ప్రకారం కేంద్ర న్యాయమంత్రిత్వశాఖను సంప్రదించారా?

  • బాండ్స్ పై తాము లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వంనుంచి స్పందన లేనప్పుడు ఎన్నికల సంఘం తనకు తానుగా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు?

  • అసలు బాండ్స్ పై ఎన్నికల సంఘం అభ్యంతరాలను ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది?

ఇలాంటి కళ్ళుతిరిగే వాస్తవాలను బయటపెట్టటానికి కారణమైన సమాచారహక్కు చట్టాన్ని నీరుగార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చట్టంలోని అనేక కీలకాంశాలను మోది ప్రభుత్వం మార్చేసింది. పైలాంటి విషయాలను తెలుసుకోవటం ముందు ముందు అసాధ్యమయ్యేటట్లు కనిపిస్తోంది.

(అనువాదం: శ్రవణ్ బాబు)

(ఈ పరిశోధనాత్మక కథనం మొట్టమొదట హఫింగ్టన్ పోస్ట్ ఇండియా వెబ్ సైట్లో ప్రచురితమయింది - link)

Read the other parts of the series here.

The Lede
www.thelede.in